అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అంటే పాడేరు కేంద్రంగా ఓ జిల్లాను ఏర్పాటు చేసి చేతులు దులుకున్నారు జగన్ అని విపక్షం ఆరోపిస్తోంది. ఇదే సందర్భంలో కనీసం ఆ నేలపై నడయాడిన ముఖ్యంగా విశాఖ మన్యంలో నడయాడిన అల్లూరి వర్థంతిని కూడా సరిగా నిర్వహించడం లేదని వాపోతోంది. బ్రిటిష్ దొరల పాలనను ఎదిరించి సాయుధ పోరు సాగించిన వీరుడ్ని గౌరవ మంత్రి స్మరించుకున్న తీరే ఇప్పటి వివాదానికి కారణం. ఆమె చేసిన పోస్టులో సంబంధిత పోస్టరులో ఉన్న తప్పిదం ఒకటి విపక్షాల విమర్శకే కాదు ఆమె అజాగ్రత్తకూ సంకేతికగా నిలుస్తోంది. ఆ వివరం ఈ కథనంలో..
బాధ్యత ఉన్న మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉంటే నవ్వి పోతారు జనం. నవ్విపోతారు విపక్షం. ఆమె ఓ రాష్ట్రానికి మంత్రి. కీలక శాఖల నిర్వహణ అన్నది ఆమె ముందున్న కర్తవ్యం. అలాంటిది మన్యం వీరుడి వర్థంతి సందర్భాన ఆమె పెట్టిన ఓ పోస్టర్ అందులో మెన్షన్ అయి ఉన్న తారీఖు ఇప్పుడొక నిర్లక్ష్యాన్ని సంకేతిస్తూ ఉన్నాయి. పర్యాటక శాఖను నిర్వహిస్తూ మన్యం ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతానికి పర్యాటకంగా గుర్తింపు దక్కేందుకు కృషి చేయడం మానుకొని ఎప్పుడుపడితే అప్పుడు ఎలా పడితే అలా విపక్ష శ్రేణులను మాత్రం ఆమె బాగానే తిడుతున్నారు అన్న వాదన అయితే టీడీపీ నుంచి వినిపిస్తోంది.
రాష్ట్రంలో గిరిజన గూడలను సందర్శించి అక్కడికి ఆనుకుని ఉన్న సుందర ప్రాంతాలను, ప్రకృతి రమణీయతతో అలరారే ప్రాంతాలను ఎకో టూరిజం పేరిట గుర్తించి డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుంది. కానీ రోజా ఆ ప్రాంతా నాయకులను కలుపుకుని పోవడం లేదు సరికదా! అస్సలు ఉమ్మడి విశాఖ జిల్లా మన్యం వైపు కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మన్యం వైపు కానీ కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇదే ఇప్పటి విచారకర విషయం.
పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి వివాదంలో ఇరుక్కున్నారు. ఇవాళ అల్లూరి వర్థంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ఆమె పోస్టు చేసిన పోస్టర్ వివాదాలకు తావిస్తోంది. అందులో తారీఖు మే నాలుగు అని ఉంది. మే ఏడు, 1924 అని ఉండాలి కానీ మే 4,1924 అని ఉంది. దీంతో విపక్ష శ్రేణులు భగ్గుమంటున్నాయి. బాధ్యత గల మంత్రి కనీసం తేదీ విషయమై కూడా సరిచూసుకోకపోవడం ఏంటని నిలదీస్తున్నాయి. తెల్లారితే చాలు విపక్ష పార్టీలను తిట్టిపోసే రోజా ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇంకా చెప్పాలంటే విషయ ప్రాధాన్యం ఉన్న విషయలను పట్టించుకోకుండా నిర్లక్ష్య పూరిత వైఖరితో ప్రవర్తించడం సబబు కాదని హితవు చెబుతున్నాయి. మన్యం వీరుడి జీవితం తమకు ఆదర్శం అని పదే పదే చెప్పే అధికార పార్టీ నాయకులు ఆయన పేరిట జిల్లా ఏర్పాటు చేసి తరువాత మిగిలిన అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని ఆరోపిస్తున్నది.