రైల్వే స్టేషన్‌లోని హాకర్స్, యాచకులను అడిగి ఆ వృద్ధుడి పేరు బిర్బిచంద్ అని తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి కొంత దూరంలో ఉన్న అతని గుడిసె వద్దకు వెళ్లి అందులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారికి రూ.1.77 లక్షల నగదు నాణేల రూపంలో దొరికింది.
ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ఓ వృద్ధుడి వద్ద భారీ ఎత్తున నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు బయట పడ్డాయి. వాటి మొత్తం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే… ముంబైలోని గోవండి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న బిర్బిచంద్ ఆజాద్ (62) అనే వృద్ధున్ని అటుగా వేగంగా వెళ్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా రైల్వే స్టేషన్‌లోని హాకర్స్, యాచకులను అడిగి ఆ వృద్ధుడి పేరు బిర్బిచంద్ అని తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి కొంత దూరంలో ఉన్న అతని గుడిసె వద్దకు వెళ్లి అందులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారికి రూ.1.77 లక్షల నగదు నాణేల రూపంలో దొరికింది. బకెట్లు, సంచుల్లో నింపబడి, టార్పాలిన్ కప్పబడి ఉన్న ఆ కాయిన్లను పోలీసులు బయటకు తీసి లెక్క పెట్టేందుకు వారికి సుమారుగా 8 గంటలకు పైగానే సమయం పట్టింది.
ఇక ఆ గుడిసెలో రైల్వే పోలీసులకు బిర్బిచంద్‌కు చెందిన ఆధార్, పాన్ కార్డులతోపాటు అతని పేరిట పలు బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ.8.77 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా దొరికాయి. కాగా బిర్బిచంద్‌ది రాజస్థాన్ అని అతని ఆధార్ కార్డు ద్వారా తెలిసింది. దీంతో రైల్వే పోలీసులు అతని కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా అక్కడ ఉంటే వారికి అతని వస్తువులు, నగదును ఇస్తామని తెలిపారు. కాగా బిర్బిచంద్ ఎన్నో ఏళ్ల కిందటే ముంబైకి వచ్చి అక్కడే యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడని ఇరుగు పొరుగున ఉండేవారు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.