రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్ట్ 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర పేరిట సోమవారం బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణ మాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. లోక్ సభ ఎలక్షన్ కోడ్ వల్లే రుణ మాఫీ ఆలస్యం అయ్యిందని అన్నారు.ప్రభుత్వ పథకాలన్నీ ఇందిరమ్మ కమిటీల ద్వారా అందిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇందిరమ్మ కమిటీలకే ఇస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన రెండు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు.