మీ బ్యాంకు ఖాతాల్లో ఏ ఖాతాలోనైనా రూ.330 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందా ? అయితే కంగార పడకండి. ఎందుకంటే ఆ మొత్తాన్ని బ్యాంకులు తీసుకోలేదు. హ్యాకర్లూ కొట్టేయలేదు. మరి రూ.330 ఎందుకు డెబిట్ అయినట్లు ? అని సందేహిస్తున్నారా ? అయితే మీ సందేహం కరెక్టే. కానీ చాలా మంది ఒక విషయం మరిచిపోయారు. అదే.. ప్రధాని మోదీ గతంలో ఓ బీమా పాలసీని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు కదా. దానికి చెందిన వార్షిక ప్రీమియం రూ.330. ఆ మొత్తమే డెబిట్ అయింది. అంతే.. అందులో జిమ్మిక్కు ఏమీ లేదు.
కేంద్రం గతంలోనే ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎవరైనా సరే రూ.330తో వార్షిక ప్రీమియం కడితే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. వ్యక్తి చనిపోతే ఆ మొత్తం అతని నామినీకి అందజేస్తారు. అయితే అప్పట్లో ఈ ప్రీమియంను ఆటోమేటిగ్గా డెబిట్ చేసుకునేలా ఖాతాదారులకు సౌకర్యం కల్పించారు. కానీ దీన్ని చాలా మంది మరిచిపోయారు. అయినప్పటికీ ఇప్పటికీ ఏడాదికి రూ.330 ఈ ఇన్సూరెన్స్ కు గాను బ్యాంకు ఖాతాల నుంచి డెబిట్ అవుతోంది. కొందరికి ఇది తెలియడం లేదు. దీంతో ఆ మొత్తం ఎందుకు డెబిట్ అయిందా ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే వ్యక్తులకు ఎన్ని ఖాతాలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క బ్యాంకు ఖాతా నుంచే ఆ మొత్తం డెబిట్ కావాలి. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాల్లోనూ ఆ మొత్తం డెబిట్ అవుతుంటే వెంటనే ఇతర బ్యాంకులను సంప్రదించి ఇన్సూరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలపాలి. అందుకు లెటర్‌ను అందజేయాలి. దీంతో డెబిట్ అయిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం మీరు కావాలనుకున్న ఒక్క ఖాతా నుంచే ఆ మొత్తం డెబిట్ అవుతుంది. ప్రతి ఏటా జూన్ నుంచి ఆగస్టు నెలల మధ్య ఈ విధంగా ప్రీమియం ఆటోమేటిగ్గా డెబిట్ అవుతుంది. కనుక ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదు.