నిన్న నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు తెలుపుతామని ఆయన తెలిపారు. ఎల్లుండి నుంచి ఆర్టీసీ జేఏసీ నేతల నిరాహార దీక్షలు చేపడుతాం. నలుగురు జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటాం. 18న జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తాం.
మా దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరుతున్నాం. అలాగే కోర్టు సూచన మేరకు వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలి. అయితే హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండానే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం కేసీఆర్ అనడం సమంజసం కాదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలి.