ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తొలి టీకాను తన కుమార్తెకు ఇప్పించారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని పుతిన్ తెలిపారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు రష్యా స్పుత్‌నిక్ V (స్పుత్‌నిక్ 5)గా నామకరణం చేసింది. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్‌ను ఇప్పుడక్కడ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు.
కాగా ఆ వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 3 ట్రయల్స్‌ను బుధవారం ప్రారంభిస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ హెడ్ కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. ఇక సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతామని, 20 దేశాలు ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ప్రీ ఆర్డర్ చేశాయన్నారు. రష్యాకు చెందిన గమలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను రష్యా రక్షణ విభాగంతో కలిసి రూపొందించింది.
రష్యా తయారు చేసిన స్పుత్‌నిక్ V వ్యాక్సిన్‌ను ముందుగా అక్కడి అత్యవసర సేవల సిబ్బందికి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి ఇస్తారు. అక్టోబర్‌లో వ్యాక్సిన్‌ను ప్రజలకు పంపిణీ చేస్తారు.