రష్యాలోని గమాలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన స్పుత్‌నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ను ఎట్టకేలకు ఆ దేశం ప్రజా పంపిణీ కోసం విడుదల చేసింది. ఆగస్టు 11న రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ వ్యాక్సిన్‌కు స్పుత్‌నిక్-వి గా నామకరణం చేసి వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌ను పంపిణీకి సిద్ధం చేశారు. దీన్ని ప్రస్తుతం ప్రజా పంపిణీకి విడుదల చేశారు.
రానున్న రోజుల్లో రష్యాలోని ప్రజలందరికీ విడతల వారీగా ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రష్యా రాజధాని మాస్కోలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఇస్తామని మాస్కో మేయర్ సెర్గే సోబిన్ తెలిపారు. కాగా ఈ వ్యాక్సిన్‌కు గాను రష్యా ఇప్పటికే ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. అయితే ఫేజ్ 1, 2 ట్రయల్స్ డేటాను ఇంకా విడుదల చేయకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అందువల్లే రష్యా వ్యాక్సిన్‌ను చాలా దేశాలు నమ్మడం లేదు.
కాగా రష్యా వ్యాక్సిన్‌కు గాను భారత్‌లో ఫేజ్ 2, 3 ట్రయల్స్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్‌డీఐఎఫ్ ఇది వరకే కీలక ప్రకటనలు చేసింది. కానీ భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు ఫేజ్ 2, 3 ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. అవి త్వరలో భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది.