కొంతమంది సెలబ్రెటీలు సామాజిక సమస్యల పరిష్కారానికి వినూత్న రీతిని ఎంచుకుంటారు. తమదైన రీతిలో స్పందించి, ఆ సమస్య పరిష్కారానికి మద్దతు కూడగడుతారు. తాజాగా, రష్యాకు చెందిన ఓ నృత్య కళాకారిణి కూడా ఇలాంటి వినూత్న దారినే ఎంచుకుంది. రష్యాలోని ఉత్తమ డ్యాన్సర్‌గా పేరున్న ఇల్మిరా బాగౌటినోవా… గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా అద్భుతమైన డ్యాన్స్ చేసింది. బటరేనాయ సరస్సు ఒడ్డున ఆమె ఈ డ్యాన్స్ చేయడానికి వెనుక బలమైన కారణం ఉంది. తాజాగా రష్యా ప్రభుత్వం బటరేనాయ సరస్సు దగ్గర్లో ఓ భారీ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తలపెట్టింది. బాల్టిక్ గ్రెయిన్ టెర్మినల్ సంస్థ సహకారంతో బటరేనాయ సరస్సు వద్ద 5 బిలియన్ల రూబుల్ (477 మిలియన్ డాలర్లు) వెచ్చించి టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టాలని రష్యా ప్రభుత్వం గతేడాది నిర్ణయించింది. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఒటరేనాయ సరస్సు రమణీయత దెబ్బతింటుందని వారంటున్నారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు ఇల్మిరా ముందుకొచ్చింది. ఆమె బటరేనాయ సరస్సు ఒడ్డున గడ్డకట్టే చలిని సైతం లెక్కచేకుండా డ్యాన్స్ చేసింది. ఆ ప్రదర్శనను సోషల్ మీడియాలో పోస్ట్‌చేసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మద్దతు వస్తోంది. ఆమె తన డ్యాన్స్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేస్తూ వసంత రుతువులో హంసలు గూడు కట్టుకునే ఒక ప్రత్యేకమైన సహజ, చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందిన బటరేనాయ సరస్సును మనమంతా రక్షించుకోవాల్సి అవసరం ఉంది. ఎంతో మంది తమ పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చి సేదదీరుతుంటారు. శీతాకాలం వచ్చిందంటే చాలు వందల మంది స్థానిక మత్స్యకారులు వేటకు బయలు దేరుతారు. ఇలాంటి ప్రకృతి సహజ ప్రదేశంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ద్వారా ఇవన్నీ విధ్వంసమవుతాయి. కాబట్టి, సరస్సును సహజ స్థితిలోనే ఉంచాలని పిలుపునిస్తూ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కోరుతున్నానని తెలిపింది. అయితే, తాను ఇక్కడ డ్యాన్స్ చేయగానే, ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేస్తుందని భావించడం లేదు. అది అంత సులభమైన పని కాదని ఆమె తెలిపింది.కానీ ఈ ప్రదర్శన వల్ల సరస్సు పరిరక్షణకు ప్రజల నుంచి మరింత మద్దతు పెరుగుతుందని భావిస్తున్నాన్నారు. ఈ అద్భుతమైన సహజ స్థలాన్ని మేము రక్షించగలిగితే అది ఎంతో గొప్ప విజయంగా భావించవచ్చు.’’ అని అన్నారు.