తెలుగులో ప్రభాస్ అభిమానులే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో థియేటర్ లోకి వచ్చేందుకు మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నాలుగు భాషల్లోనూ సాహో టీం చేస్తోన్న ప్రమోషన్లు హోరెత్తిపోతున్నాయి. సాహో ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు కాస్త ప్రాబ్లమ్స్ తప్పలేదట. కంటెంట్ దృష్ట్యా ఎటువంటి కట్స్ లేకుండా అయితే ఏ మార్క్ లేదా కొన్ని చెప్పిన మార్పులు చేస్తే యు/ఎ ఇస్తామని అధికారులు చెప్పినట్టుగా వినికిడి. ఏ సర్టిఫికెట్ ఇస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మల్టీ ప్లెక్సుల్లో 18 లోపు వయసు పిల్లలు సాహో చూసేందుకు అనుమతించరు. ఇది ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఆ సినిమా హాళ్ల మేనేజ్‌మెంట్‌కు కూడా తలనొప్పే.
సినిమా రన్ టైం విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిడివి 2 గంటల 52 నిముషాలు అనే టాక్ ఉంది. ఒకవేళ ఫైనల్ కట్ లో ఏమైనా తగ్గించారేమో చూడాలి. శనివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు సెన్సార్ విషయంలో బోర్డు మెంబర్లు పెట్టిన రూల్స్‌తో ఏం చేయాలో తెలియక మేకర్స్ సైతం తికమక పడుతున్నట్టు తెలుస్తోంది.
రేపటికల్లా దీనిపై క్లారిటీ రానుంది. బాహుబలి 2ని టార్గెట్ చేసిన సాహో ముందు కొండంత లక్ష్యం ఉంది. మరి సాహో ఎలాంటి సెన్సార్ రిపోర్టుతో రంగంలో ఉంటాడో ? ఏం చేస్తాడో ? అన్న టెన్షన్ ఉంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చిన వెంటనే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌లు స్టార్ట్ చేస్తారు.