శబరిమల ఆలయంలో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది మహిళల బృందం ఆలయానికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలోని మొదటి బేస్ క్యాంపు వద్ద వీరిని అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తమిళనాడుకు చెందిన మహిళా హక్కుల కోసం పోరాడే మణితి అనే సంస్థకు చెందిన మహిళలుగా వారిని పోలీసులు గుర్తించారు. కోర్టు తీర్పుని అమలు పరచడంలో ప్రభుత్వం విఫలం అయిందంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆలయ ప్రవేశం చేయాల్సిందేనని వారు భీష్మించుకోవడంతో పోలీసులు పటిష్ఠ భద్రత కల్పించారు. తొలుత కేరళ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తాము ఇక్కడికి వచ్చినట్లు ఆ మహిళలు తెలిపారు. ‘‘మేం నిరసనకారులుగా ఇక్కడికి రాలేదు. దేవుణ్ని దర్శించుకునేందుకు యాత్రికులుగా వచ్చాం.. మాకు దర్శనం కల్పించండి అంటూ కోరారు. భక్తుల నిరసనలతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రత ఏర్పాట్లు కల్పించారు.