తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల వివాదం అసలు ఎవరు సృష్టించారో… రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు అని సజ్జల పేర్కొన్నారు.
దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న సజ్జల… కేంద్ర జల శక్తి ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. జల విద్యుత్ పేరుతో ఏకంగా 30 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా సముద్రం పాలు చేసిందని విరుచుకుపడ్డారు. ఎగువ ప్రాంతంలో ఉన్నామని.. జల జగడానికి కేసీఆర్ ప్రభుత్వం దిగిందని చురకలంటించారు.
ఏపీ వాటా నీటిని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు సజ్జల. ఇక అంతకుముందు కృష్ణా జలాల విషయంలో ఏపీ దాదాగిరి చేస్తోందని.. కేంద్రం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వెళ్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటాలను వదులుకునే ప్రసక్తే లేదని.. ఏపీ, కేంద్రం వైఖరితో తెలంగాణకు నష్టమన్నారు సీఎం కేసీఆర్.