175 స్థానాల్లో గెలిచే వాతావరణం YCPకి ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. MLAలు, కో ఆర్డినేటర్ల, జిల్లా అధ్యక్షులతో మాట్లాడిన ఆయన.. ‘ఓటర్ల జాబితా సవరణల్లో అప్రమత్తంగా ఉండాలి. దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుగ్గా ఉండాలి. ప్రభుత్వ మేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వాలంటీర్లపై ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి’ అని సూచించారు. ఈ క్రమంలోనే.. ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్ కో-ఆర్డినేటర్లతో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీకి ప్రతిరోజూ కీలకమేనని, ఏమరుపాటు పనికి రాదని సూచించారు. వైసీపీకి 175కి 175 స్థానాలు గెలుచుకునే వాతావరణం ఉందన్నారు.
ఈ నెల 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా పాల్గొనాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుకుగా ఉండాలన్నారు. అసైన్డ్ భూములు, చుక్కల భూములు విషయంలో ప్రభుత్వం చేసిన మంచి పనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు.. ఎమ్మెల్యేలకు, కోఆర్డినేటర్లకు సంధానకర్తగా వ్యవహరించాలన్నారు. వాలంటీర్లను ఢీఫేమ్ & టెర్రరైజ్ చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. వారు చేస్తున్న విద్వేష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. వాలంటీర్లలో ఆత్మస్థైర్యం పెంచాలని పేర్కొన్నారు.