సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, కిమ్స్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉందని, మరో రోజు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. కాగా, నిన్నరాత్రి సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో బాలుడు అపస్మారక స్థితికి వెళ్లడంతో అక్కడున్న పోలీసులు సీపీఆర్ చేసి ఆస్పత్రి తరలించారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా గురువారం (డిసెంబర్-5) ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుండగా.. ఏపీ, తెలంగాణలో థియేటర్ల వద్ద పలు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం రాత్రి బెనిఫిట్ షోలు ప్రదర్శించబడగా..హీరో అల్లు అర్జున్ నిన్న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లి ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. బన్నీ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని బాలుడి తండ్రి ఆరోపించారు.