సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కోడిపందాలు, ఢమరుక నాదాలూ.. తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే సంక్రాంతి వైభవం ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా ఉండే ఏకైక పండుగ సంక్రాంతి మాత్రమే. అన్ని పండుగలలో కెల్లా ఇది పెద్ద పండగ. భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో.. మూడు రోజులపాటు ఈ పండగను జరుపుకుంటారు. చదువు, ఉద్యోగాల రిత్యా.. ఎక్కడెక్కడో స్థిరపడినప్పటికీ.. ఈ సంక్రాంతి పండగకు మాత్రం అందరూ.. సొంతూళ్లకు పయనమవుతారు.
అయితే సంక్రాంతి గురించికొన్ని విషయాలు తెలుసుకుందామా. ఆ రోజు ఏం చేస్తే ఏం ఫలితం ఉంటుంది అనేది తెలుసుకోండి మరి. ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని , పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్య్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు.