పుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు … సటాకె కంపెనీతో మంత్రి గంగుల చర్చలు

-

తెలంగాణలో స్పెషల్ పుడ్ ప్రాసెసింగ్ జోన్ల(Food processing zones)ను ఏర్పాటు చేయాలనే యోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయం తెల్సిందే. స్పెషల్ పుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు నేపథ్యంలో ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలోని ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గతంలో కర్ణాటకలోని హైగ్రేడ్ మిల్లింగ్ సామర్థ్యం కలిగిన సటాకె కంపెనీకి సంబంధించిన యంత్రాలను అధికారులు పరిశీలించారు. అయితే తాజాగా సోమవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సటాకె కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… మిల్లింగ్ ప్రక్రియలోని ఇబ్బందుల్ని అధిగమించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రపథాన నిలుపుతున్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో స్పెషల్ పుడ్ ప్రాసెసింగ్ జోన్లకు తక్కువ ధరకే యంత్రాలు అందించేందుకు సటాకె సంస్థ సంసిద్దంగా ఉన్నట్లు మంత్రి గంగుల వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలోనే ట్రైనింగ్ తో పాటు , 24 గంటల సర్వీసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సటాకె ప్రతినిధులు మంత్రి గంగులకు వివరించారు. రోజుకు 500 టన్నుల ధాన్యం సామర్థ్యంతో మిల్లింగ్ యంత్రాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా మిల్లింగ్ యంత్రాల విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version