స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉందా? అయితే ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారా? అయితే మీకు ఒక అలర్ట. వినియోగదారుల ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రివేళల్లో ఎటీఎంల నుంచి రూ.10 వేలకు పైబడి నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి.
బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు బయటికి వస్తుంది. ఓటీపీ ఆధారిత క్యాష్ విత్ డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ఎస్ బీఐ భావిస్తోంది.