కవితకు పార్టీ పగ్గాలు…?

-

కొత్త ఏడాది ఉగాది సమయంలో ముఖ్యమంత్రి పదవి కేటీఆర్‌కు కట్టబెట్టి, పార్టీ పగ్గాలు కూతురి చేతికిచ్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

గత కొన్ని వారాలుగా, 2020 సంవత్సరం టీఆర్‌ఎస్ పాలిటి పెనుమార్పుల ఏడాదిగా మీడియా ఊదరగొడుతోంది. దానికి తగ్గట్టే కొన్ని ముందస్తు మార్పులు అప్పుడే గోచరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు విచిత్రంగా మారిపోతున్నాయి. ఎదురులేని శక్తిగా ఎదిగిన (?) బీజేపీ, క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడల్లా అర్థమవుతోంది. 2017లో 71శాతం ఉన్న బిజేపీ పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్‌ కల్లా 40 శాతానికి పడిపోయాయి. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు, రాష్ట్రాల విషయం వచ్చేప్పటికి స్థానిక ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గు చూపారు. . ప్రజానీకం చాలా స్పష్టతతో ఉన్నారని దీంతో అర్థమవుతూంది. 2020లో ఇంకా ఢిల్లీ, బిహార్‌ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి

తాజాగా ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పిఆర్‌లు బిజేపీ పాలిట భస్మాసురహస్తాలుగా మారినట్టు ఝార్ఖండ్‌ ఎన్నికలు నిరూపించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు ప్రాంతీయ పార్టీలలోనూ కొత్త ఆశలు మొగ్గ తొడుగుతున్నాయి. సహజంగానే బిజేపీలో అంతర్మథనం మొదలైంది. 2024 సాధారణ ఎన్నికలలోపు పూర్తిచేయాలని నిశ్చయించుకున్నవి మోదీ అజెండాలో చాలానే ఉన్నాయి. కామన్‌ సివిల్‌ కోడ్‌, పీఓకే స్వాధీనం..ఇలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాల గొంతు పెరిగితే మోదీకి ఇరకాటంగా మారుతుంది. ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలనైనా తమవైపు తిప్పుకోకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఊహించిన మోదీషా ద్వయం, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే, టీఆర్‌ఎస్‌ను కూడా సంప్రదించినట్లు ఓ ప్రచారం. ముందుగా వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు రాష్ట్ర బిజేపీ శాఖకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం వెంటనే మానేయాలని ఆ హెచ్చరికల తాత్పర్యం. టీఆర్‌ఎస్‌ ఎన్‌డిఏలో చేరాలని కేసీఆర్‌కు అమిత్‌ షా ఒక ‘పెద్ద’ పదవి ఆఫర్‌ చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ‘ముఖ్యమంత్రి పీఠం కొడుక్కి అప్పజెప్పి, మీరు ఢిల్లీ వచ్చేయండ‘ని షా కేసీఆర్‌తో అన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్‌ కూడా కొంత సానుకూలంగానే ఆలోచించినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా.

ముఖ్యమంత్రి పీఠం కేటీఆర్‌కు వదిలిపెడ్తే, ఓడిపోయి, తీవ్ర నిరాశానిస్పృహలతో ఉన్న కూతురు కవిత పరిస్థితేంటని కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు, తదనుగుణంగా పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగిస్తే బాగుంటుందేమోననే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు ప్రగతిభవన్‌ వర్గాల గుసగుసలు. అంతేకాక, వారి స్వంత మీడియా సంస్థలను కూడా తనకే అప్పగించాలని కవిత గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై కుటుంబసభ్యుల్లో కొంత బేధాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ నిర్ణయానికే అందరు కట్టుబడిఉన్నారట.

ఏతావాతా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎటొచ్చీ, కేసీఆర్‌ ఢిల్లీకా, ఫామ్‌హౌస్‌కా అనే సంగతి తెలియడంలేదు. నిజానికి గత 18 సంవత్సరాలుగా అలుపెరుగని ఉద్యమంలోనూ, పాలనలోనూ తీవ్రంగా శ్రమించిన కేసీఆర్‌ ఒకింత విశ్రాంతి కోరుకోవడంలో తప్పేమీలేదు. కానీ, కేసీఆర్‌ అపర చాణక్యుడు. ఎవరూ ఊహించలేనంత రాజకీయ చతురత ఆయన సొంతం., ఆయన నిజంగానే ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తారా? ఢిల్లీకి వెళతారా? లేక బిజేపీ వ్యతిరేక పవనాలను తనవైపు తిప్పుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారా? అనేది ఇప్పుడు తేలాల్సిఉంది.

ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లతో అట్టుడుతున్న దేశాన్ని చూస్తున్న కేసీఆర్‌ను, ఓవైసీ దోస్తానా కూడా ముందుకే తీసుకెళ్తుంది. బీజెపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టి, ‘గాంధీ కావాలా? గాడ్సే కావాలా? అనే నినాదంతో ఢిల్లీపై యుద్ధం ప్రకటిస్తాడని కూడా మీడియా కోడై కూస్తోంది.

మొత్తానికి కేసీఆర్‌ నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మోదీషాతో కయ్యమా? నెయ్యమా? అనేది రాబోయే కొద్దిరోజుల్లో ప్రజలకు తెలిసిపోతుంది.

– రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news