దేశంలోని అనేక బ్యాంకులు ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు సాధారణ జనాల కన్నా అధిక శాతం వడ్డీని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఎక్కువ వడ్డీని పొందవచ్చు. అయితే అన్ని బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్లకు అధిక శాతం వడ్డీని ఇస్తుందని చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన ఎస్‌బీఐ వీకేర్ స్కీంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పొందవచ్చు. ఇక ఇందులో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునే వారు కింది ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే…
1. భారత పౌరులై ఉండి, 60 ఏళ్లు నిండిన ఎవరైనా సరే ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీంకు ఆఖరి గడువును సెప్టెంబర్ 30వ తేదీగా నిర్ణయించారు.
2. ఈ స్కీంలో 5 నుంచి 10 ఏళ్ల వరకు డబ్బు డిపాజిట్ చేయవచ్చు.
3. ఇందులో భాగంగా డిపాజిట్ చేసే మొత్తానికి సాధారణ మార్కెట్ రేట్ కన్నా 0.8 శాతం ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఈ స్కీంలో ఏడాదికి 6.20 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. అయితే ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు ఇచ్చే వడ్డీ రేట్లు మారితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కు ఇచ్చే వడ్డీ రేటు కూడా మారుతుంది. కానీ వాటి కన్నా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది.
4. డిపాజిటర్లు నెల, 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకునేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక స్పెషల్ టర్మ్ డిపాజిట్ అయితే మెచూరిటీ పూర్తి అయ్యాక వడ్డీ ఇస్తారు. అందులో టీడీఎస్‌తోపాటు వడ్డీని లెక్కిస్తారు.
5. ఒక ఏడాదిలో డిపాజిట్ల ద్వారా రూ.50వేల కన్నా ఎక్కువ మొత్తంలో వడ్డీని పొందితే అందులో నుంచి టీడీఎస్‌ను కట్ చేస్తారు.
6. ఎస్‌బీఐ వీకేర్ డిపాజిట్ ఎఫ్‌డీకి డిపాజిటిర్లు లోన్లు కూడా తీసుకోవచ్చు.
7. డిపాజిట్ గడువు ముగియకుండానే ముందస్తుగా విత్‌డ్రా చేస్తే అదనంగా ఇచ్చే 30 బేసిస్ పాయింట్ల వడ్డీని ఇవ్వరు.
8. ఈ స్కీంలో భాగంగా రూ.2 కోట్ల వరకు మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.