తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వరదల వల్ల క్షేత్ర స్థాయిలో పంట నష్ట తీవ్రత మీకు అర్థం కావడం లేదా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. పంట నష్టం లేదని వ్యవసాయ మంత్రి మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు. బీమా పథకాన్ని ఎత్తేసి రైతులకు తీవ్ర నష్టం చేశారన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని, దీని కోసం వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక మేట, భూమి కోతకు గురైన పొలాలు బాగు చేసుకునేందుకు అదనంగా ఎకరాకు రూ.5000 సాయం చేయాలన్నారు.
అలాగే తిరిగి పంటలు వేసుకోవడానికి విత్తనాలు అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. కుదిరితే ఫసల్ బీమా పథకాన్ని పునరుద్ధరించాలి.. లేదంటే కొత్త పథకాన్ని అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.