ఏపీ రాజ‌ధానిలో సీన్ రివ‌ర్స్‌…. నిర్మానుష్య‌మే…!

-

ఏడాది క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎక్కడ చూసిన జనాలు సందడి ఉండేది. భారీ నిర్మాణాలు…. సందర్శకులు…. అనేక పనుల మీద రాజధానికి వచ్చేవారు…. కోట్ల రూపాయల టర్నోవర్… ఇతర రాష్ట్రాల నుంచి రాజధాని నిర్మాణ పనుల్లో పని చేసేందుకు వచ్చిన వలస కార్మికులు ఇలా ఎక్కడ చూసినా కోలాహాలం ఉండేది. కోట్ల‌లో డ‌బ్బు రొటేష‌న్ అయ్యేది. గత రెండు మూడు నెలలుగా చూస్తే పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. ఆర్థిక మందగమనం, ఇసుక కొరతతో పాటు రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లిప్త‌త‌తో ఉండడంతో ఇక్కడ నిర్మాణ పనులు బాగా తగ్గిపోయాయి. దీంతో వేలాది మంది వలస కార్మికులు అమరావతి నుంచి తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లి పోతున్నారు.

తెలంగాణ, బీహార్, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల నుంచి గత మూడున్నరేళ్లుగా వేల మంది వలస కార్మికులు ఇక్కడ పనులు చేస్తున్నారు. వీరంతా రాజధాని ప్రాంతంలో పెద్ద, చిన్న తరహా అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మాణ పనులలో భాగస్వాములు అయ్యారు. కొద్ది నెలలుగా పనులు లేకపోవడంతో వీళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రాజెక్టులు ఆగిపోవటంతో ప్రస్తుతం రాజధానిలో నిర్మాణ పనులు అక్కడే ఆగిపోయాయి.

20 శాతం పనులు ఇంకా పూర్తి కానీ కారణంగా.. తన అపార్ట్మెంట్ ఫ్లాట్లను విక్రయించ లేదని, దీనికి కారణం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి బ్లాక్ మార్కెట్లో కూడా ఇసుక దొరకడం లేదని బిల్డ‌ర్లు వాపోతున్నారు. నిర్మాణ కార్యకలాపాలు ఆపేయ‌డంతో పాలరాయి కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి, ప్లంబర్లు, రోజువారీ వేతన నిర్మాణ కార్మికులు తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాల శివార్లలో చిన్న ఇళ్లలో ఉంటూ.. నెల‌కు ఇళ్ల‌కు రు.15-20 వేల వ‌ర‌కు పంపించే వ‌ల‌స కార్మికుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి.

ఇక రియ‌ల్ ఎస్టేట్ ఘోరంగా ప‌త‌న‌మైంది. ఇక్క‌డ కోట్లాది రూపాయ‌లు ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు రేట్లు ప‌డిపోవ‌డంతో లబోదిబోమంటున్నారు. ఏదేమైనా ఏపీ రాజ‌ధానిలో కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే సీన్ అంతా రివ‌ర్స్ అయిపోయింది. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌ట‌కి మారుతుందో ?  మ‌ళ్లీ ఇక్క‌డ నిర్మాణాల క‌ళ‌క‌ళ‌, జ‌న‌సందోహం ఎప్పుడు కిట‌కిట‌లాడుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version