పశ్చిమ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 23 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని, ఈ కేసుపై సీబీఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ అంశంపై మే 6న వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
కాగా, పశ్చిమ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇస్తూ 2016 నాటి రిక్రూట్మెంట్ చెల్లదని తెలిపిన విషయం తెలిసిందే. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్ సీ, డీలో చేసిన నియామకాలన్నీ చట్ట విరుద్ధమని పేర్కొంది. దీంతో నియమితులైన 23వేల మందికి పైగా ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ తీర్పు చెప్పుతూ… వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో మొత్తం జీతాన్ని తిరిగివ్వాలని తెలిపింది.ఇక ఈ తీర్పు చట్టవిరుద్ధమని సీఎం మమత మండిపడిన విషయం తెలిసిందే.