కరోనా వైరస్ బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు వైద్యులు ప్రస్తుతం భిన్న రకాల మెడిసిన్లను వాడుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి పలు రకాల మెడిసిన్లను ఇస్తున్నారు. వాటిల్లో ఫావిపిరవిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ తోపాటు పలు యాంటీ వైరల్ మెడిసిన్లు, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, ఇతర మెడిసిన్లు ఉంటున్నాయి. ఇక హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ సహా ప్లాస్మా థెరపీ వంటి విధానాల ద్వారా కరోనాను నయం చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ చికిత్సకు స్వల్ప సంఖ్యలో మెడిసిన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ కోవిడ్ చికిత్సకు ఉపయోగపడే వంద కొద్దీ డ్రగ్స్‌ను సైంటిస్టులు ప్రస్తుతం గుర్తించారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఆనంద శంకర్ రాయ్ నేతృత్వంలో సైంటిస్టులు స్టడీ చేపట్టారు. కోవిడ్ చికిత్సకు ఉపయోగపడే వందలకొద్దీ డ్రగ్స్, కెమికల్స్‌ను మెషిన్ లెర్నింగ్ సహాయంతో గుర్తించారు. అయితే కొన్ని డ్రగ్స్‌ను ఇప్పటికే అమెరికాలోని ఎఫ్‌డీఏ ఆమోదించిందని, అందువల్ల వాటిని కోవిడ్ చికిత్సకు వాడవచ్చని సైంటిస్టులు తెలిపారు. ఇక ఇతర కెమికల్స్ కోవిడ్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయి, వాటి వాడకం వల్ల మనుషులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. అనే విషయాలను వారు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు.
కాగా సైంటిస్టులు ఆయా డ్రగ్స్, కెమికల్స్‌ను గుర్తించేందుకు గాను మొత్తం 200 మిలియన్ల వరకు కెమికల్స్‌ను మెషిన్ లెర్నింగ్ ద్వారా విశ్లేషించారు. అందువల్లే ఈ ఆయా డ్రగ్స్, కెమికల్స్ ను గుర్తించడం సాధ్యమైందని అంటున్నారు. అయితే వారు గుర్తించిన డ్రగ్స్‌లో ఏయే డ్రగ్స్ ఉన్నాయి..? అనే జాబితాను మాత్రం వారు విడుదల చేయలేదు. త్వరలో ఆ వివరాలను విడుదల చేసే అవకాశం ఉంది.