రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ : మంత్రి హారీష్‌ రావు

రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియ కు శ్రీకారం చుట్టనున్నామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. రెండవ విడతలో 50 వేల రూపాయల లోపు పంట రుణం పొందిన 27 వేల 753 మంది అర్హులైన రైతులకు గాను 94 కోట్ల 56 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నామని స్పష్టం చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లాలో స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి హారీష్‌ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ రూపురేఖలే మారనున్నాయని… ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమైన ప్రాజెక్ట్ గా కాళేశ్వరం చరిత్ర సృష్టించిందన్నారు. సమైక్య పాలనలో వలసలు ,ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలకు నెలవుగా ఉన్న తెలంగాణ ను , స్వ రాష్ట్రంలో ఇవాళ దేశానికే అన్నం పెట్టే దేశపు భాండాగారంగా మారిందని తెలిపారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన దిశగా నాటి ఉద్యమ నాయకుడు , నేటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకెలుతుందని స్పష్టం చేశారు హరీష్‌ రావు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే తలమానికమన్నారు.