పశువైద్యాధికారి దిశ హంతకులు ఉంటున్న కారాగారం చర్లపలి. ఈ చర్లపల్లి జైలు వద్ద ప్రస్తుత పరిస్థితి ఉద్రికత్తగా ఉండటంతో తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద 144 సెక్షన్‌ను విధించారు. అటు వైపు వాహానాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు చర్లపల్లి జైలు వద్ద ఎందుకు ఉద్రికత్తత ఏర్పడింది.. భారీ బందోబస్తు పోలీసులు ఎందుకు ఏర్పాటు చేశారు.. 144 సెక్షన్ ఎందుకు విధించారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న తరుణం ఇది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో దిశపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అయితే ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారిని చర్లపల్లి జైలుకు తరలించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నిందితులను జైల్లో పెట్టి కాపాడవద్దని, వారిని ప్రజలకు అప్పగిస్తే. ప్రజాకోర్టులోనే శిక్ష విధిస్తామంటూ దేశమంతా నినదిస్తుంది.
ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం ఎంతటి పరిణామాలకైనా దారితీస్తుందనే నిఘా వర్గాల హెచ్చరికలతో చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దిశ హత్య కేసు నిందితులు జైల్లో ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో నిరసనలు ఆందోళన కార్యక్రమాలను అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. దిశ హత్య కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలనే పోలీసుల పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది.
నిందితులను లోతుగా విచారించేందుకు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దిశ మొబైల్ ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ఈ రోజు షాద్ నగర్ కోర్టు విచారించనుంది. అందుకే నిరసన కారులు జైలు పరిసర ప్రాంతాలకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు తెలంగాణ పోలీసులు. నిందితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి ఆటంకం కలుగకుండా పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు.