అక్రమ బంగారం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల నుంచి కిలోల కొద్దీ అక్రమ బంగారం పట్టుబడుతుంది. ఇంటి దొంగల సహకారంతో అంతర్జాతీయ ముఠాలు సాధారణ ప్రయాణికులనే కొరియర్లుగా మార్చి వేల కోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్నారు. బ్యాక్ జిప్పుల్లో, కరెంటు తీగలుగా, బొమ్మలు, లోదిస్తుల్లో పెట్టి అక్రమ రవాణా చేస్తున్న తీరుకు కస్టమ్స్ అధికారులే నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది.
దుబాయ్ ప్రయాణికుడి వద్ద 11.89 లక్షల విలువచేసే 228 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసి చెప్పులలో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. ప్రయాణికుడి నడవడికలో అనుమానంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కాళ్లకు వేసుకునే చెప్పుల కింది భాగంలో దాచిన బంగారాన్ని కనిపెట్టారు. ప్రయాణికుడిని అరెస్టు చేసి, అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.