కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్ కి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారందరూ నేరస్థులు అని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనుకాల సీఎం పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు.
తనను అడ్డుకొని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరూ నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసనకు దిగాలని సూచించినట్టు ఆరోపించారు. అయిగే గవర్నర్ ఆరీఫ్.. పలు యూనివర్సిటీలలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినేట్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కాలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు.