Shah Rukh Khan Son: సినీ ఇండస్ట్రీలో ముంబై డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసు పలువురు సెలబ్రిటీల చుట్టూనే తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుకున్నాడు. దీంతో పెద్ద ఎత్తున దుమారం లేచింది.
సముద్రం మధ్యలో నిర్వహిస్తున్న క్రూయిజ్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ అడ్డంగా బుక్కారు. ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్, నుపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలు దొరికినట్లు తెలిపారు. అసలు వీరికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో విచారిస్తున్నారు ఎన్సీబీ అధికారులు.
ఎన్‌సీబీ ముంబై డైరెక్టర్ సమీర్ వాంఖడే .. ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ముంబై నుండి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి భారీ డ్రగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. అంథేరీలో 5 కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు.
మరో షాకింగ్ విషయమేమిటంటే.. ఈ ముఠాకు హైదరాబాద్ తో లింకులు ఉన్నట్టు బయటపడ్డాయి. ఈ ఎఫిడ్రిన్ హైదరాబాద్ కేంద్రంగా తయారైనట్టు తేల్చారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే సుశాంత్‌సింగ్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధాకపూర్ తదితరులను ఎన్‌సీబీ విచారించింది.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఉన్న లింకులపై ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్యన్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐతే, ఆర్యన్ కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తే.. కొంతమంది యంగ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ తాను ఈ పార్టీలో భాగమని ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. తాను కూడా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఈ కేసు విచారణలో ఎంతమంది బయటకు వస్తారో వేచి చూడాలి.