తెలంగాణను బొందలగడ్డ చేసి.. భారతదేశాన్ని బంగారం చేస్తారా ? అని సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జనగామలో భూక్య రమేష్, భూపలపల్లిలో రమేష్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో భూక్య చందర్, మహబూబాబాద్ జిల్లాలో బోడ సిరి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగారు తెలంగాణ చేసేశానని ఇక బంగారు భారతదేశాన్ని తయారు చేయడానికి బయలుదేరుతున్న దొరగారు, బతకలేక ఒక్క రోజులనే బొందలగడ్డల పాలైన ఈ నలుగురు రైతులు బంగారు తెలంగాణ బిడ్డలుకారా? అని ఫైర్ అయ్యారు. వీరంతా పంటలు నష్టపోయి, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే రైతులను ఆదుకోకుండా చచ్చేలా చేయడమేనా ? అని అగ్రహించారు.
రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పాడే ఎక్కడమేనా? ఇక్కడి రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పింది చాలదని దేశ రైతులను పొట్టన పెట్టుకోవడానికి బయలుదేరుతున్నారా ? అని నిలదీశారు షర్మిల. 59ఏండ్లు దాటినోళ్లు రైతులు కాదా? వాళ్లకు రైతుబీమా ఎందుకియ్యరని మండిపడ్డారు. రైతుకు వయోపరిమితి పెట్టడమేంటి.. దీనిపై కోర్టులో తేల్చుకుంటామన్నారు షర్మిల.