ఆమె న‌న్ను క‌ల‌వాల‌నుకున్నారు.. ఇంత‌లోనే.. : చిరంజీవి

-

నన్ను కలవాలని, తనతో నన్నో వేదిక మీద చూడాలని ఆమె అనుకున్నారు. ఇంత‌లోనే ఆమె తిరిగిరాని లోకాల‌కు త‌ర‌లివెళ్ల‌డం మ‌న‌సును క‌ల‌చివేసింది.. శోభానాయుడు మ‌ర‌ణం బాధాక‌రం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘తన జీవితాన్ని నృత్యకళకే అంకితం చేసిన గొప్ప కూచిపూడి కళాకారిణి శోభానాయుడు. వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన వ్యక్తి. ఆ స్థాయి కళాకారులు మళ్ళీ వస్తారా అనేది పెద్ద ప్రశ్నే’’ అని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.

తనకు వ్యక్తిగతంగా శోభానాయుడితో ఎంతో పరిచయం ఉందని ఆయన తెలిపారు. ‘కరోనా ఉపద్రవాన్ని జయిస్తాం’ అనే థీమ్‌తో ఆమె నృత్య రూపకం రూపొందించి కళలు, సమాజంపై ఆమె అభిమానాన్ని చాటుకున్నారని కొనియాడారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘కరోనాపై శోభానాయుడు నృత్యగేయం చూసి ఆమెకు స్వరకర్త కోటిగారి ద్వారా నా ప్రశంశలు తెలియజేశా. ఇందుకు కృతజ్ఞతగా ఆమె నాకు శుభాకాంక్షలు పంపించారు. అదే మా ఆఖరి సంభాషణ.. నాకు కోటి ఆ విషయం చెప్పగా… ఆమె నంబర్‌ తీసుకున్నాను. ‘అభిమానుల మనసుల్లో శాశ్వతంగా హీరోగా నిలిచిపోయిన మా చిరుగారికి అనేక వందనాలు. కోటిగారితో మీరు నా గురించి ప్రస్తావించిన అంశాలు విని చిన్న పిల్లలా ఎగిరి గంతేశాను. మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. మీమీద నాకున్న అభిమానం మాటల్లో చెప్పలేను. ఈ గడ్డుకాలం పోయాక మేం చేయబోయే మొదటి ప్రదర్శనకు మీరు, కోటిగారు అతిథులుగా రావాలి’ అని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని చెప్పాను. ఇవాళ శోభానాయుడు మనముందు లేకపోవడం దురదృష్టకరం’’ అని చిరంజీవి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news