కరోనా లాక్ డౌన్ సమయంలో బ్యాంక్ రుణాలపై కేంద్రం ఆరు నెలలపాటు మారటోరియం విధించింది..మారటోరియం కాలానికి రుణాలపై వడ్డీ విధింపుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది..రూ 2 కోట్ల లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్రం గతంలోనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికి అమలు చేయడంలో జాప్యంపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది..మరో వైపు బ్యాంకు రుణాల వడ్డీపై వడ్డీ మాఫీకి నవంబరు 15వరకు సమయం కావాలని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం..తాజాగా నవంబరు 2ను డెడ్‌లైన్‌గా విధించింది సుప్రీం కోర్టు. రెండు కోట్ల రూపాయలలోపు బ్యాంకు రుణాలకు వడ్డీ పై వడ్డి మాఫీని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేసేందుకు నెల ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది ధర్మాసనం. తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్న చిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాలని తెలిపింది కేంద్రం. ఆ వాదనపై సుప్రీం కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన నెలకోంది. సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉందని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. నవంబరు 15 వరకు సమయం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.