తెలంగాణకు చెందిన కమెడియన్ పొట్టి వీరయ్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన నవ్వులు పూయించిన వీరయ్య..అసలు పేరు గట్టు వీరయ్య. కానీ, ఆయన పొట్టి వీరయ్యగా ప్రజలకు సుపరిచితం. మరుగుజ్జు అయిన వీరయ్య స్వగ్రామం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఫణిగిరి. పదో తరగతి వరకు చదువుకున్న వీరయ్య సినిమాల్లోకి రావడానికి ఆయన జీవితం మారిపోవడానికి కారణం శోభన్ బాబు అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండబోదు. ఆ సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘సోగ్గాడు’గా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరో శోభన్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. శోభన్ బాబును వీరయ్య కలిసిన తర్వాత వీరయ్య జీవితం మారిపోయిందని చెప్పొచ్చు. 1967లో ఉద్యోగం కోసం మద్రాసుకు వెళ్లిన వీరయ్య… అక్కడ తనకు శోభన్ బాబు కనబడగానే తనకు బయట ఎటువంటి ఉద్యోగాలు దొరకడం లేదని తనకు సినిమాలలో నటించే అవకాశం ఇవ్వడానికి సాయపడాలని ఆయన్ను కోరారు. వీరయ్య మాటలు విని శోభన్ బాబు ఆయనకు ఓ సలహా ఇచ్చాడు.
నీలా ఉన్న వ్యక్తులకు అవకాశాలు ఉండబోవని, తగు వేషాలు బావ నారాయణ లేదా దర్శకుడు విఠలాచార్య సినిమాలలో ఉంటాయని చెప్పాడు శోభన్ బాబు. దాంతో వీరయ్య దర్శకుడు విఠలాచార్యను కలిశాడు. ఆయనకు అవకాశం ఇవ్వడంతో పాటు రూ.500 అడ్వాన్స్ గా ఇచ్చారు. అలా వీరయ్యకు నటుడిగా అవకాశాలు స్టార్ట్ అయ్యాయి. అయితే, అంతకు ముందర కేవలం 90 పైసలకు ఉద్యోగం చేసేవాడు వీరయ్య. వీరయ్యలోని నట ప్రావీణ్యాన్ని గుర్తించి శోభన్ బాబు ఆయనకు తగు సలహా ఇచ్చిన తన జీవితాన్ని మార్చారు.
తొలుత తమిళ్ భాషలో రాక వీరయ్య ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత పలు భాషలు నేర్చుకుని వీరయ్య నటుడిగా పలు సినిమాల్లో నటించి చక్కటి పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం కలిపి నాలుగొందలకు పైగా చిత్రాల్లో కమెడియన్ గా వీరయ్య నటించాడు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో వీరయ్య నటించారు. వీరయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గతేడాది ఏప్రిల్ 25న తుదిశ్వాస విడిచారు.