తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మైండ్‌బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేయడమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీగా పోటీ చేయడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. సహజంగానే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ఆయన మాటే పైచేయి అవుతుంది. తన భార్య కోదాడ ఎమ్మెల్యేగా గతంలో ఓ సారి గెలిచి… గత ఎన్నికల్లో ఓడారు. ఎవరినో తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే లేనిపోని తలనొప్పులు వస్తాయనే ఆయన పద్మావతే ఇక్కడ పోటీ చేస్తుందని ముందుగా ప్రకటించారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఆ ప్రకనట చేయడంలో తప్పులేదు కూడా.. అయితే ఆ వెంటనే రేవంత్ రెడ్డి కోదాడోల ఓడిన పద్మావతి ఎలా ? పోటీ చేస్తారని.. అక్కడ చామల కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీలో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ మధ్య గ్యాప్‌కు కారణమయ్యాయి. ఆ వెంటనే ఉత్తమ్‌తో విబేధించే పాత నల్లగొండ జిల్లా నాయకులు కూడా ఒక్కసారిగా రంగంలోకి దిగి ఉత్తమ్‌కు మద్దతు ప్రకటించారు.
తమ జిల్లాలో ఇతర జిల్లాల నాయకులు వేలు పెట్టనవసరం లేదని… రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి లాంటి వాళ్లు. రేవంత్ ఎంత రచ్చ చేసినా ఆయన మాట ఏఐసీసీ పట్టించుకోలేదు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రేవంత్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. రేవంత్ అనవసరంగా తనకు సంబంధం లేని విషయంతో తలదూర్చి… ఎదురు దెబ్బ తిన్నట్లే అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.