ఆదివారం భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగాల్సిన తొలి టి20 మ్యాచ్ ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కవర్లు కప్పి ఉంచిన పిచ్ మీదకు నీళ్ళు ఏ విధంగా వచ్చాయో ఎవరికి అర్ధం కాలేదు. ఆ వివాదం పూర్తి కాక ముందే తాజాగా మరో వివాదం బయటకు వచ్చింది. అసోం క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆటగాళ్ళ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రద్దు కాక ముందే స్టేడియం నుంచి ఆటగాళ్ళు వెళ్ళిపోయారన్నాడు.
చాలామంది ఆటగాళ్లు తొమ్మిది గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారని, కాని అంపైర్లు రాత్రి 9.54కి మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నాడు. బహుశా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించి ఉండొచ్చని, కానీ క్రికెటర్లు ముందుగానే వెళ్లిపోవడం మాత్రం వాస్తవమని చెప్పాడు. దాదాపు గంట సేపు భారీ వర్షం పడిందని,
సిబ్బందికి అంపైర్లు 57 నిమిషాల సమయమే ఇచ్చారని, మరికొంత సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లమన్నాడు. గంట సమయం ఇచ్చి ఉంటే మ్యాచ్ కి మైదానం సిద్దంగా ఉండేదన్నాడు. ఈ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇస్త్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లతో మైదానాన్ని ఆరబెట్టాలను కోవడం వివాదాస్పదంగా మారింది. కాగా ఇండోర్లో శ్రీలంకతో టీమిండియా నేడు రెండో మ్యాచ్ ఆడనుంది.