దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగుతున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పరస్పర దాడులు హింసకు దారితీశాయి. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. తాజాగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీచేశారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత నాలుగు రోజుల నుంచి శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే సోమవారం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసకు దారితీసింది. ఈ ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండువర్గాల వారు పరస్పరం ఇండ్లకు నిప్పు పెట్టుకున్నారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు.
అయితే మంగళవారం మళ్లీ ఘర్షణలు కొనసాగాయి. చాంద్‌బాగ్ సహా ఢిల్లీలోని మొత్తం ఆరు ప్రాంతాలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు వాహనాలకు, దుకాణాలకు నిప్పంటిచారు. ఈ ఘటనల్లో మంగళవారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య మొత్తం 13కి చేరింది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.
ఈ ఘర్షణలను నిలువరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఆందోళనకారులపై లాఠీచార్జి, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఢిల్లీ వీధుల్లో 144 సెక్షన్ విధించారు. అయినా ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు చివరగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు జారీచేశారు. దీంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఢిల్లీ ప్రజలు గడగడ వణుకుతున్నారు. మరోవైపు అధికారులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. రేపు జరుగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశారు.