కాంగ్రెన్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పటియాల సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది పాటు ఆయనకు శిక్ష పడింది. ఈ శిక్షా కాలంలో ఆయన జైలులో క్లర్క్ గా పని చేస్తున్న విషయం వైరల్ అయింది. ఈ విషయాన్ని అధికారులే వెల్లడించారు. సాధారణంగా జైలులో శిక్ష పడిన ఖైదీలకు జైలులో ఏదైనా పనులను అప్పగిస్తారు. ఇందులో భాగంగా సిద్ధూకు క్లర్క్ వర్క్ ను అప్పగించాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు ప్రకటించారు.
సిద్ధూ కాంగ్రెస్ నేత కావడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా ఇతర ఖైదీల్లా జైలు గది నుంచి బయటకు వచ్చి చేసే పనులు అప్పగించలేదని అధికారులు తెలిపారు. సిద్ధూ రోజుకు రెండు షిప్టుల్లో పని చేస్తారన్నారు. తొలి మూడు నెలలు సిద్ధూకు ట్రైనీగా పరిగణలో తీసుకుని శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కోర్టు తీర్పులను బ్రీఫింగ్ చేయడం, జైలు రికార్డులను రాయడం వంటి పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయన నైపుణ్యాన్ని బట్టి రోజుకు రూ.40 నుంచి రూ.90 వరకు వేతనం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.