కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే !

-

కార్తీకం.. పవిత్రమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రతీకరం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో చేసే ప్రతి మంచి/చెడు రెండూ ఫలితాలు సాధారణం కంటే అధిక రెట్లు ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి గురించిన విశేషాలు తెలుసుకుందాం…

365 వత్తుల దీపాలు !

సనాతన ధర్మంలో దీపానికి గొప్ప విశేషత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజాగదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలని పెద్దలు చెబుతారు. కానీ ఓపికలేకనో, సమయం కుదరకనో ప్రతి రోజూ అలా దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. అందుకోసం కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా దీపాన్ని వెలిగించాలి. కానీవారు లేదా మరింత రెట్టింపు ఫలితాలన్ని పొందాలనుకునేవారు వీలైతే సంవత్సరంలో ఉన్న రోజులన్నింటికీ గుర్తుగా ఈ రోజున 365 వత్తులు వెలిగించమని చెబుతారు.

దీపారాధన ఇలా చేయాలి !

కార్తీక పౌర్ణమి రోజు తలార స్నానం చేసి, పూజాదికాలను నిర్వహించుకొని, ఉపవాసం ఉండి… సాయంవేళలలో ఆవునెయ్యి లేదా నువ్వులనూనెతో దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో దీపానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి, అలాంటి దీపాన్ని దానం చేస్తే మరింత మంచిదని చెబుతుంటారు. అందుకోసం బియ్యపుపిండి లేదా గోధుమపిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేస్తుంటారు. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలలో సైతం దీపదానం చేస్తారు. మట్టితో చేసిన ప్రమిదలని దానం ఇవ్వడం అంత శుభసూచకం కాదు కాబట్టి ఇలా పిండితో చేసిన దీపాలను దానం చేయమని సూచించి ఉంటారు.

త్రిపురి పౌర్ణమి

కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలవడం కద్దు. పూర్వం శివభక్తులైన ముగ్గురు రాక్షసులు ఉండేవారట. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదన్నా వరాన్ని కోరుకొనమని అడుగగా తమను బంగారం, వెండి, ఇనుము అనే మూడు పురాలకు అధిపతులుగా చేయమని కోరుకున్నారు. అంతేకాదు.. అంతరిక్షంలో సంచరించే ఈ మూడు పురాలూ ఎప్పుడైతే ఒకే రేఖ మీదకి వస్తాయో, ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకు న్నారు. ఇలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఆ పరమేశ్వరుడే వారిని సంహరించేందుకు పూనుకున్నాడు. వేయి సంవత్సరాల అనంతరం ఎప్పుడైతే ఆ మూడు పురాలూ ఒక్క తాటి మీదకు వచ్చాయో, అదను చూసి వాటిని తన బాణంతో ఛేదించి త్రిపురాంతకుడు అయ్యాడు. ఇదే త్రిపుర పౌర్ణమి.

కార్తీక జ్వాలాతోరణం

కార్తీకమాసం రోజున శివాలయాల వద్ద జ్వాలాతోరణాన్ని నిర్వహిస్తారు. ఒక ద్వారం రూపంలో ఉన్న కర్రలకి ఎండుగడ్డిని చుట్టి, అవి మండుతుండగా వాటి కింద నుంచి శివపార్వతుల విగ్రహాలను తీసుకువెళ్తారు. జ్వాలాతోరణంలోని గడ్డిని కనుక పశువులకు తినిపించినా, గడ్డి మేటలో దాచుకున్నా సకల శుభాలూ కలుగుతాయని రైతులు భావిస్తారు. శివుడు అగ్ని స్వరూపం కాబట్టి ఇలా జ్వాలా రూపంలో కానీ, దీప రూపంలో కానీ కొలుస్తారు. అగ్నిలింగాన్ని సూచించే తిరువణ్ణామలై కొండ మీద కార్తీకమాసంలోని కృత్తికా నక్షత్ర సందర్భంగా భారీ దీపాన్ని వెలిగిస్తారు.

పౌర్ణమి.. సముద్రస్నానాలు

కార్తీకపౌర్ణమి అనగానే సముద్ర స్నానం.. ఏడాదిలో ఎప్పుడు సముద్ర స్నానం చేసినా చేయకపోయిన ఆషాడం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా సముద్ర స్నానం చేయమని సూచిస్తుంటారు. సముద్ర స్నానం చేయడానికి ఈ సందర్భాలు అనువుగా ఉండటం ఒక కారణం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రభావం చాలా ప్రభావవంతంగా ఉంటుందనీ పండితులు పేర్కొంటున్నారు. ఇక సముద్ర స్నానం వీలుకాని వారు జీవనది అంటే కృష్ణా, గోదవరి వంటి వాటిలో లేదా సమీపంలో ఉండే నదులు, ఉపనదులలో స్నానం ఆచరించాలి. అదీ వీలుకాకుంటే బావి/బోర్‌ వేసుకుని అప్పుడే పట్టిన నీటితో స్నానం చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news