సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతులు లభించడం ఏమోగానీ రెండు కంపెనీల ఎండీల మధ్య మాటల యుద్ధం నడిచింది. సీరమ్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా భారత్ బయోటెక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోవిషీల్డ్, మోడెర్నా, ఫైజర్లు తప్ప ఇతర వ్యాక్సిన్లు అన్నీ నీళ్లేనని అనడంతో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల స్పందిస్తూ కఠినంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు విభేదాలను పక్కన పెట్టి సంయుక్త ప్రకటన చేశాయి.
వ్యాక్సిన్ల వల్ల ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని, దీని వల్ల కరోనా మహమ్మారి అంతమవుతుందని, అలాగే దేశాల ఆర్ధిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడతాయని రెండు కంపెనీలకు చెందిన ఎండీలు అన్నారు. తమ కంపెనీలు వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి భారత్‌తోపాటు ప్రపంచానికి అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్లు ప్రజలకు, దేశాలకు చాలా ముఖ్యమని అన్నారు. అందువల్ల తాము సంయుక్తంగా ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించేందుకు ప్రతినబూనుతున్నామని అన్నారు. అయితే ఆ రెండు కంపెనీలు ఇలా ప్రకటన చేయడంతో ఇక రెండు కంపెనీల మధ్య ఉన్న గొడవ సద్దుమణిగినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసి ఏ కంపెనీ ముందుగా అందరికీ అందిస్తుందో చూడాలి.