ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఈ క్రమంలో కేరళలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పాతిపెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో పౌల్ట్రీ ఉత్పత్తులైన చికెన్, కోడిగుడ్లను తినవచ్చా అని అందరికీ సందేహాలు కలుగుతున్నాయి. అందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే..?
బర్డ్ ఫ్లూనే ఏవియన్ ఫ్లూ అంటారు. ఇది హెచ్5ఎన్1 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ పక్షుల పేగుల్లో ఉంటుంది. అందువల్ల పక్షుల నుంచి పక్షులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇక పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ చాలా తక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే బర్డ్ ఫ్లూ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ ఉన్న కోళ్లను లేదా వాటి మాంసాన్ని లేదా గుడ్లను ముట్టుకుంటే మనుషులకు ఈ వైరస్ సోకవచ్చు. దీంతో మనుషుల్లో పలు లక్షణాలు కనిపిస్తాయి.
బర్డ్ ఫ్లూ సోకితే దగ్గు, డయేరియా, శ్వాసకోశ సమస్యలు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇక ఇలాంటి పరిస్థితిలో కోడి మాంసం, గుడ్లను తినవచ్చా.. అంటే తినవచ్చు. కాకపోతే మార్కెట్ నుంచి వాటిని తెచ్చాక చేతులను, అవి తాకిన శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లను అయితే బాగా ఉడకబెట్టాలి. ఇక చికెన్ అయితే 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉడకాలి. అలా ఉడికించి తింటే ఏమీ కాదని వైద్యులు తెలిపారు.