సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహ్మస్వామి భక్తులపాలిట కొంగుబంగారం. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడి కోరికను మన్నించిన స్వామి.. సింహగిరిపై కొలువు తీరాడనేది స్ధల పురాణం. వరాహా, నారసింహా అవతారాల కలయికతో ఉండటం ఇక్కడి దేవుడి ప్రత్యేకత. ఆర్తిగా పిలిస్తే పలుకుతాడనే విశ్వాసం సింహాద్రి అప్పన్న భక్తులది. కష్టమైనా, సుఖమైనా ఆయనతో పంచుకోవడం…. తొలిపంటను, కోడెదూడను భక్తితో సమర్పించుకోవడం ఆనవాయితీ.
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడంటారు. మిగిలిన చోట ఏమో కానీ… సింహాచలం దేవస్ధానంలో మాట నిజమే అనిపిస్తోంది. తలనీలాల దగ్గర నుంచి ఇత్తడి కానుకల వరకు అన్నింటికీ రెక్కలు వచ్చేస్తున్నాయి. ఇక, దేవుడికి వచ్చిన విరాళాల్లో అవకతవకలు… స్వామివారి భూముల ఆక్రమణలకు లెక్కేలేదు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
స్వామివారికి సమర్పించే తలనీలాల దొంగతనం దగ్గర ప్రారంభమైన అపకీర్తి.. ఆలయంలో నిత్యం ఏదో ఒక సంఘటన రూపంలో కొనసాగుతూ దేవదేవుడి ప్రతిష్టకు భంగం కలిగిస్తూనే వున్నాయి. మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు అపహరించుకుపోవడం కలకలం రేపింది. పవిత్రమైన సింహాచలం క్షేత్రంలో.. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటి దొంగలే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.