TSPSC పేపర్ లీక్ కేసులో గత నెల రోజులుగా జరిపిన దర్యాప్తు వివరాలను సిట్ హై కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. పేపర్ లీకేజీలో 40 లక్షల వరకు లావాదేవీలు జరిగాయంది. అక్రమంగా ప్రశ్నపత్రాలు పొందిన 15 మందిని అరెస్టు చేశామని వెల్లడించింది. కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్‌ఛార్జ్ శంకరలక్ష్మిని సాక్షిగా పేర్కొన్న సిట్.. ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రవీణ్, రాజశేఖర్‌దే ప్రధాన పాత్రగా వెల్లడించింది.
టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుడిని విచారించామన్న సిట్.. గతంలో అనేక క్లిష్టమైన కేసులు దర్యాప్తు చేసిన అనుభవం తమకు ఉందని తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీపై పటిష్టమైన దర్యాప్తు జరుగుతోందని… సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదంది. కీలకమైన ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందన్న సిట్… ఆరోపణలు చేసిన రాజకీయ నేతలు కీలకమైన సమాచారం ఇవ్వలేదని తెలిపింది. సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను హైకోర్టుకు సమర్పించింది.
నిందితులు, వారి ప్రమేయమేంటి.. పరీక్ష రాసిన సిబ్బందికి ఎన్నిమార్కులు వచ్చాయి.. తదితర వివరాలు పట్టిక రూపంలో ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.