దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సిట్ పోలీసులు తెలిపారు. బిగ్ బాస్కెట్‌కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు బయటికి వెళ్లాయని.. ఆ సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. పాలసీబజార్ వినియోగదారుల వివరాలు బయటికెళ్లిన విషయాన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేలిందన్నారు.
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని.. బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు విచారణకు వస్తే దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని సిట్ అధికారులు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.
గూగుల్ క్లౌడ్‌లో వ్యక్తిగత వివరాలు పెట్టి విక్రయాలు చేస్తున్నారని.. క్లౌడ్‌లో వివరాలు పెట్టిన వాళ్ల గురించి చెప్పాలని గూగుల్‌కు లేఖ రాసినట్లు వివరించారు. గూగుల్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళుతుందని.. ఈ క్రమంలోనే దర్యాప్తులో కాస్త ఆలస్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు.