ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు కోళ్లు, మేకలను తీసుకొస్తే ఆర్టీసీ బస్సుల్లోకి అనుమతించమని టీఎస్ఆర్టీసీ ఎండీ సీవీ సజ్జనార్ స్పష్టం చేశారు.
వరంగల్ లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో మేడారం మహాజాతరపై జరిగిన ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశం లో ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ…..మేడారం మహాజాతరకు 6 వేల బస్సులను సిద్ధం చేశామని వెల్లడించారు. మొత్తం15వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని ,తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు. ఈసారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నామని.. జాతర బస్సులకు సాదారణ చార్జీలే తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. మేడారం జాతరలో విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బంది కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపొందించిన టీ షర్ట్ లను సజ్జానార్ ఆవిష్కరించారు.