అంగన్​వాడీ కేంద్రంలో పాము పిల్లల కలకలం.. ఏకంగా 30 ?

మామూలుగా ఒక పామును చూస్తే గుండె జలదరిస్తుంది. అలాంటిది ఏకంగా 30 పాము పిల్లలు కనబడితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది మరెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి అంగన్​వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక్కడి అంగన్వాడీ కేంద్రంలో పాములు కలకలం సృష్టించాయి. నిన్న గదిని శుభ్రం చేస్తుండగా ఆయాకు రాళ్ళ మధ్యలో మొదటగా ఒక పాము కనపడింది.

స్థానికుల సాయంతో ఆ పామును చంపించింది. ఆ రాళ్లు అన్నీ తీయగా అందులో నుంచి వరుసగా 30 పాము పిల్లలు, 2 తేళ్లు బయటకు వచ్చాయి. ముందు కాస్త బిత్తరపోయిన అక్కడి స్థానికులు తర్వాత తేరుకుని వాటన్నింటినీ చంపి బయట పడేశారు. అయితే ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పాములు, తేళ్లు వస్తున్నాయి అని వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.