తెలంగాణలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య సంఘటన అందరినీ కలచివేస్తోంది. తహసీల్ధార్ విజయా రెడ్డి గారి మరణం తీవ్ర విచారకరం.. ఈ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారానికి తెర తీశారు. రెవెన్యూ అధికారులు జలగల్లాంటి వారని.. ఇలాంటి లంచగొండి అధికారులకు శిక్ష పడాల్సిందే అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇది మరీ అమానవీయమైన ప్రచారం. తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు, లంచానికి ఏమన్నా సంబంధం ఉందా ? కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదాన్ని ఒక ఎమ్మార్వో ఎలా పరిష్కరించగలరు ? సాక్షాత్తు నిందితుడి తల్లే వాడికి మతిస్థిమితం ఉందని చెబుతోంది. అలాంటి పరిస్థితుల్లో బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాల్సిందిపోయి ఈ దిక్కుమాలిన ప్రచారమేంటన్న ఆందోళన కనిపిస్తోంది.
అయినా… ప్రజాస్వామ్యంలో ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నిజంగా సమస్య ఉంటే నిజాయితీగా కోట్లాడవచ్చు. వాస్తవానికి అధికారులను పక్క తోవలు పట్టేది ప్రజలే. లంచాలు ఆశ చూపేది జనమే. పని అయ్యాక తీరా నిందించేది ప్రజలే అన్న వాదనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
తహసీల్ధార్ విజయా రెడ్డి గారి కి భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, కన్న తల్లి ని కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏంటి ? సమస్య ఎలాంటిదైనా దాన్ని పరిష్కరించుకోవడానికి అనేక వేదికలు, మార్గాలు ఉన్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా అనవసర విమర్శలను ప్రచారం చేయడం సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడమే అవుతుంది.