మోసగాళ్లు ఎవరైనా సరే… బ్యాంకుకు కన్నం వేసి డబ్బుల్ని దోచుకోవాలని ఆలోచిస్తారు. లేకపోతే వేల కోట్ల అప్పులు చేసి కట్టకుండా విదేశాలకు పారిపోతారు. ఇలాంటి సంఘటనలు మనం అనేకం చూసినా కానీ, భారతదేశంలో ప్రజలకు బ్యాంకులపై అపార నమ్మకం. అయితే ఇదే నమ్మకాన్ని పెట్టుబడిగా కొందరు వ్యక్తులు ప్రజల్ని దోచుకుంటున్నారు. ఈ నమ్మకాన్ని పెట్టుబడిగా ఏకంగా ఓ నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు కొందరు కేటుగాళ్లు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్ రూటీ లో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
ఇక ఈ విషయం పై అనుమానం వచ్చిన ఓ ఎస్బిఐ కస్టమర్ తాను అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచ్ మేనేజర్ కు ఆ విషయం పై చర్చించడంతో, సదరు ఎస్బిఐ మేనేజర్ ఉన్నత అధికారులతో చర్చించారు. అయితే ఆ ప్రాంతంలో కేవలం రెండు బ్రాంచ్ లకే అనుమతి ఉండగా ఈ బ్రాంచ్ గురించి తమకు తెలియదని చెప్పడంతో అధికారులు నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ పై దాడులు నిర్వహించారు. దీనితో అక్కడ చూసిన ఎస్బిఐ అధికారులకు నోటమాట రాలేదు. అచ్చం ఎస్బిఐ బ్యాంకు లో ఉన్న ఫర్నిచర్ తో సహా అచ్చుగుద్దినట్టు అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురిని ఎస్బిఐ అధికారులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సదరు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అలాగే ఈ నకిలీ ఎస్బిఐ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.