సోము వీర్రాజు యూటర్న్ తీసుకుంది అందుకేనా ?

-

బీసీ సిఎం అంటూ సోము వీర్రాజు చేసిన కామెంట్స్ కొత్త టర్న్ తీసుకున్నాయి. ప్రత్యర్ధులకు సవాల్ విసరాలనుకున్నారో లేక స్వపక్షంలో ఉన్న మిత్రపక్షాన్ని డిఫెన్స్ లో పెట్టాలనుకున్నారో బీసీ సీఎం సవాల్ తో పెద్ద చర్చ తీసుకొచ్చారు. మళ్లీ ఒక్కరోజులోనే మాట మార్చి తన ఉద్దేశం అది కాదని ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరానని యూటర్న్ తీసుకున్నారు..దీంతో సోము టర్న్ వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది.

సోము వీర్రాజు సవాల్ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే తీసుకువచ్చింది. ఇంటా.. బయటా దీనిపై నేతలు స్పందించారు. అయితే తాను ఎపికి బిసి సిఎం అనలేదని వీర్రాజు చెపుతున్నారు. తాను వైసిపి, టిడిపిలను ప్రశ్నించానని అంటున్నారు. బిజెపి దేశంలో బిసిలను సిఎంలను చేసిందని, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఆ పని చెయ్యగలవా అని అడిగానంటున్నారు. ఒక్క రోజులో సోము వీర్రాజు వెనక్కి తగ్గడం వెనుక ఏ కారణాలున్నాయనే చర్చ నడుస్తోంది.

ఎవరి విమర్శలు ఎలా ఉన్నా..జనసేన నేతలు పవన్ కల్యాణే సిఎం అభ్యర్థి అని చెపుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సీటు బిజెపికి ఇస్తున్న కారణంగా సిఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలని పట్టుపడుతున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా, అసలు సిఎం అభ్య్థర్థిపై ఎటువంటి చర్చ లేకున్నా జనసేన ఆ ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో ఈ విషయంలో అటు బిజెపిలో కూడా చర్చ జరిగింది. కానీ బహిరంగంగా దీనిపై ఏమీ మాట్లాడలేదు. ఈ చర్చ నడుస్తుండగానే బిసి సిఎం అంటూ కొత్త చర్చ తీసుకువచ్చారు సోము వీర్రాజు.

బీసీ సీఎం ప్రకటన పై వెనక్కి తగ్గిన సోము వీర్రాజు ఈ అంశం తన పరిధిలోది కాదంటూ వెనక్కి తగ్గారు. సిఎం అభ్యర్థి ఎవరనేది నడ్డా, పవన్ కూర్చుని మాట్లాడి చెపుతారని ప్రకటించారు. అయితే ఇప్పటికే సిఎం అభ్యర్ధి విషయంలో పవన్ పేరును జనసేన విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది. ఈ సమయంలోనే వీర్రాజు బిసి సిఎం అంటూ ప్రటకన చెయ్యడం పై ఆ పార్టీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. వీర్రాజు యాదృచ్చికంగా మాట్లాడారని ఆ పార్టీ నేతలు చెపుతున్నా, ఇదంతా వ్యూహాత్మక ప్రకటన అంటూ జనసేన తప్పుపడుతోంది.

సోము వీర్రాజు ప్రకటన పై జనసేన ఎక్కడా స్పందిచలేదు. ఆ పార్టీలో విధాన అంశాలపై స్పందించాల్సింది అయితే పవన్ కళ్యాన్ లేదంటే నాదెండ్ల మనోహర్. ఇద్దరూ దీనిపై మౌనంగానే ఉన్నారు. కానీ క్యాడర్ మాత్రం వీర్రాజు ప్రకటనను ఒప్పుకోలేకపోతున్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో కూడా బిజెపి ఏకపక్షంగా ప్రకటన చేసిందని జనసేన భావిస్తోంది. ఇప్పుడు బిసి సిఎం ప్రకటన వెనుక కూడా బిజెపి ఎజెండా వేరుగా ఉందంటూ లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి వీర్రాజు దూకుడు ఇరు పార్టీల మద్య కొత్త చిక్కును తెచ్చిపెట్టింది. ఈ ప్రకటన పై బీజేపీ హైకమాండ్ లెవల్లో కూడా చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version