లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను తరలించేందుకు బస్సులు, విమానాలు, రైళ్లు ఏర్పాటు చేస్తున్న సోనూసూద్, అటు ‘నిసర్గ’ తుపాను నేపథ్యంలోనూ ఆపన్నులకు చేయూతగా నిలిచాడు. ముంబై తీర ప్రాంతంలోని సుమారు 28 వేలమందికి ఆహారం అందించడమే కాకుండా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశాడు. ‘నిసర్గ’ తుపాను ముంచుకు వస్తోందన్న వార్తలతో తన బృందం అప్రమత్తమైందని, తీర ప్రాంత ప్రజల ఆకలి తీర్చడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాల్లోని కాలేజీలు, పాఠశాలలకు తరలించామని సోనూసూద్ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, ‘నిసర్గ’ తుపాను కారణంగా 200 మంది అస్సామీ వలస కూలీలు ముంబయిలో చిక్కుకుపోయారని, వారిని షెల్టర్ కేంద్రాలకు తరలించామని చెప్పారు.