దేశంలో లౌడ్ స్పీకర్, హనుమాన్ చాలీసా కేంద్రంగా వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ అంశాల చుట్టూ రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. మొదటగా మసీదుల పై లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) రాజ్ థాకరే డిమాండ్ చేశారు. దీనిపై అప్పటినుంచి చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియను కూడా చేపట్టారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ కూడా స్పందించారు.
ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ విజ్ఞప్తి చేశారు. లౌడ్ స్పీకర్, హనుమాన్ చాలీసా వివాదంపై విచారం వ్యక్తం చేశారు.” ప్రజలు ఇప్పుడు ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడి విషం చిమ్ముకుంటున్న తీరు చూస్తుంటే నా గుండె ఆగిపోతుంది. రెండున్నరేళ్లుగా అందరం కలిసి కరోనాపై పోరాడుతున్నాం. రాజకీయ పార్టీలు కూడా కరోనా మహమ్మారి ఎదుర్కొన్నాయి. కరోనా రోగులు అందరికీ ఆక్సిజన్ అవసరమైనప్పుడు, ఎవరు మతం గురించి పట్టించుకోలేదు. కరోనా ముప్పు మన దేశాన్ని ఏకం చేసింది. మతానికి అతీతమైన సంబంధాలు మనవి”. అని సోనూసూద్ అన్నారు.