దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబై నగరానికి ఇకపై పట్టే ప్రయాణ కాలం 11 గంటలు మాత్రమే కానుంది. సుమారుగా 1400 కిలోమీటర్ల దూరం ఈ రెండు నగరాలకు మధ్య ఉంటుంది. అయితే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఆధ్వర్యంలో నిర్మించనున్న జాతీయ రహదారి వల్ల ఆ మొత్తం దూరం ప్రయాణించేందుకు ఇకపై కేవలం 11 గంటల సమయం మాత్రమే పట్టనుంది. రెండు నగరాల మధ్య దాదాపుగా 1400 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఈ హైవేను మాత్రం 1275 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు.
ఎన్‌హెచ్ఏఐ ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పోస్ వెహికిల్ కంపెనీ ఢిల్లీ-ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించనుంది. 1275 కిలోమీటర్ల దూరాన్ని మొత్తం 8 లేన్లుగా విభజించి జాతీయ రహదారిని నిర్మిస్తారు. తరువాత భవిష్యత్తులో దీన్ని 12 లేన్లుగా మారుస్తారు. ఈ రహదారిపై గంటకు సుమారుగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. రహదారి మొత్తాన్ని పూర్తిగా టోల్ కిందకు తీసుకువస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారతమాల పరియోజన ఫేజ్-1లో భాగంగా ఇలాంటి రహదారులు మొత్తం 28వేల కిలోమీటర్లను అభివృద్ధి చేయనున్నారు. వాటిలో ఢిల్లీ-ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కూడా ఒకటి.
ఈ రహదారిపై 50 కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ ఇస్తారు. ఈ క్రమంలో రహదారి పక్కన వాహనదారులకు సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.82,514 కోట్లు వెచ్చించనున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక ఎన్‌హెచ్ఏఐ స్వయంగా టోల్ చార్జిని వసూలు చేస్తుంది. మార్చి 2024 వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. దీంతో ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.