ప్రొటీన్ లోపాన్ని తగ్గించేందుకు సోయా ఆకు మూంగ్ దాల్ కర్రీ, బనానా షేక్

-

మన దేశంలో చాలా మందికి ప్రొటీన్ లోపం ఉంది. ఇక లోపం అంటే.. టాబ్లెట్ వేయడమే మార్గం అనుకుంటారు. కానీ తినే ఆహారం ద్వారా కూడా ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయొచ్చు. ఈరోజు మనం హై ప్రోటీన్ ఉండే కర్రీ ఒకటి నేర్చుకుందాం. ప్రొటీన్ అంటే.. సోయానే నెంబర్ వన్. పప్పుల్లో పెసరపప్పు. అధిక బలం, అధిక ప్రోటీన్ కావాలంటే.. సోయా ఆకు మూంగ్ దాల్ కర్రీ చేసుకోవాల్సిందే. ఇంకెందుకు లేట్.. ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం.

సోయా ఆకు మూంగ్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు

సోయఆకు ఒకటిన్నర కప్పు
పెసరపప్పు అరకప్పు
టమోటా ముక్కలు అరకప్పు
టమోటా పేస్ట్ ఒక కప్పు
వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్
అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి 2
ఇంగువ పొడి కొద్దిగా
పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం..

ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో మీగడ వేసి అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఇంగువ పొడి, ధనియాల పొడి వేగనిచ్చిన తర్వాత సోయా ఆకును వేసి 4-5 వేగనివ్వాలి. అందులో ఉన్న నీరు శాతం తగ్గుతుంది. అప్పుడు పసుపు, టమోటా ముక్కలు, కడిగిన పెసపప్పు, టమోటా రసం వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి.. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే. మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు నిమ్మరసం వేసి దింపేస్తే సరి. సోయా ఆకు మూంగ్ దాల్ కర్రీ రెడీ. చపాతీల్లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగాలనుకునేవారు అయితే కచ్చితంగా తినాల్సిన ఆహారంలో ఇది ఒకటి.

సమ్మర్ లో ఏదైనా సరే కూల్ గా ఉండేవి తాగాలనిపించడం సహజం.. అలాంటప్పుడు హెల్తీ అయినా ప్రొటీన్ రిచ్ బనానా షేక్ ఎందకు ట్రై చేయకూడదు. దీనివల్ల వేసవి తాపం తీరడమే కాకుండా.. ప్రోటీన్ లోపం కూడా తగ్గుతుంది. 100 గ్రాముల అరిటిపండులో 116 కాలరీల శక్తి ఉంటుంది. వెయిట్ పెరగాలనుకునే వారికి.. బనానాను డైలీ తింటే చాలు. ఈరోజు మనం హెల్తీ బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా

కావాల్సిన పదార్థాలు

అరటిపండ్లు రెండు
పాలు ఒక కప్పు
నానపెట్టిన జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్
నానపెట్టిన బాదంపప్పు ఒక టేబుల్ స్పూన్
సోంప్ పౌడర్ ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం..

మనం బాదంపప్పు, జీడిపప్పును పాలు పోసి ఒక గంటపాటు నానపెట్టుకోవాలి. నానిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పును మిక్సీలో వేసుకుని అందులోనే అరటిపండ్లు, ఖర్జూరం పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వీలైతే ఇంట్లో కుండ ఉంటే.. అందులో పాలు పోసి.. కాసేపు
ఇసుకలో ఉంచి.. ఆ పాలు కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. లేదంటే కూలింగ్ తక్కువ ఉన్న పాలు వేసుకుంటే సరి. అందులో సోంపు పౌడర్ వేసి మళ్లీ ఓసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత గ్లాసులోకి తీసుకుంటే.. బనానా మిల్క్ షేక్ రెడీ. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. చిన్నపిల్లలకు, ఎంత తిన్నా బరువు పెరగడంలేదనుకునే వారికి.. డైలీ ఒక గ్లాస్ చొప్పున ఇచ్చారంటే.. రెండు వారాల్లోనే మంచి ఫలితం ఉంటుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news